అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే: జోగు రామన్న

ఆదిలాబాద్, వెలుగు: సీసీఐపై ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసి.. మరోసారి అబద్ధాల అమిత్ షాగా రుజువు చేసుకున్నారని కేంద్ర హోం మంత్రిపై ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీసీఐ పునరుద్ధరణ విషయమై గతంలో అనేక సార్లు కేంద్ర మంత్రులను విన్నవించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని అన్నారు. 

పునరుద్ధరణ విషయమై సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినట్లు గుర్తుచేశారు. ఇందుకు వ్యతిరేకంగా స్థానిక బీజేపీ నేతలు మాత్రం అబద్దాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్​అయ్యారు. సీసీఐని తెరిపించే ఆలోచన కేంద్రానికి ఉంటే తుక్కు కింద సామగ్రిని అమ్మేయాలని టెండర్​ను ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఆదివాసీలకు ఆర్వోఎఫ్ఆర్ కింద పట్టాలు అందించడమే కాకుండా వారి సంక్షేమం కోసం బీఆర్ఎస్ ​ప్రభుత్వం పాటుపడుతోందని, ఆదివాసులకు కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించారు.

 సీఏం కేసీఆర్ ఆరోగ్యం గురించి కనీస మానవత్వం లేకుండా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడుపుతున్నారని.. ఏ అర్హత ఉందని అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐ సెక్రటరీ పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు.