యాదగిరిగుట్ట, వెలుగు: ‘అన్ని పార్టీ ల నుంచి క్యాడర్ బీఆర్ఎస్లో చేరడంతో కలగూర గంపలా తయారైంది. క్యాడర్‌కు ప్రియారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వానికి, పార్టీకి సమన్వయం లోపించింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం’ అని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోయి నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఓడామన్నారు. క్యాడర్, నాయకులను గౌరవించుకోవడంలో అశ్రద్ధ వహించడం కూడా ఓటమికి కారణమైందన్నారు. సంక్షేమ పథకాల డబ్బులను డైరెక్టుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం వల్ల పార్టీకి క్రెడిట్దక్కలేదన్నారు.
ఎమ్మెల్యేలకే కేసీఆర్ పూర్తి అధికారం ఇవ్వడంతో.. కొందరు క్యాడర్‌ను లెక్క చేయలేదన్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న క్యాడర్‌ను పక్కనపెట్టి కొత్తగా వచ్చిన లీడర్లకు ప్రియారిటీ ఇవ్వడంతో.. పాత క్యాడర్ నారాజ్ అయ్యారన్నారు. దీంతో ప్రచారంలో వెనుకబడి ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఓటమిపై సమీక్ష జరపకుండా ఎంపీ ఎన్నికలకు పోతే అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయని హెచ్చరించారు.
అభివృద్ధి ఒక్కటే గెలుపునకు ఉపయోగపడదని.. ప్రజల మనసులు గెలుచుకుంటేనే విజయం దరిచేరుతుందన్నారు. కొందరు లీడర్లు శనిలా దాపురించిన్రు. సమావేశంలో కొందరు బీఆర్ఎస్ లీడర్లు కూడా ముఖ్య నేతల తీరుపై మండిపడ్డారు.మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆలేరుకు శనిలాగా దాపురించాడని గుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు.
మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులను చిన్నచూపు చూడడం వల్లే ఆలేరులో ఓడామన్నారు. అతివిశ్వాసం వల్లే ఓడిపోయామని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వాపోయారు. అహంకారం, అహంభావం పెరిగిపోవడం వల్లే ఓటమి మూటగట్టుకున్నామని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.