జనగామ: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పారు. జిల్లాను ముక్కలు చేయొద్దని అన్నందుకే రెండోసారి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ లో ఇవాళ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే కాలరాసిందన్నారు.
పదేళ్లపాటు కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని విమర్శించారు. గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు కోర్టుకు వెళ్లడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేశారు. శాసనసభా పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అన్నారు. తెలంగాణ ఉపఎన్నికలు రావని.. ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని వెల్లడించారు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందని వెల్లడించారు.