స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన 2 ఎకరాల స్థలంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి ప్రపోజల్స్ రెడీ చేసి ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆర్డీవో వాసం రామ్మూర్తి అధ్యక్షతన నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చట్ట విరుద్ధంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పారు.
శివునిపల్లిలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో దెబ్బ తిన్న రోడ్డు, అండర్ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డుకు రిపేర్లు చేయాలని సూచించారు. శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కూరగాయాల మార్కెట్లను ఫ్రైఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్ సమీపంలో, శివునిపల్లి రైల్వే ఫ్లైఓవర్ కింద కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించాలని ఆదేశించారు. డీపీవో రాంగాచారి, డీఎల్‌పీవో వెంకటప్రసాద్, ఈవో ఎదునూరి సత్యనారాయణ, ఏవో చంద్రన్‌కుమార్, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగెల రాజు పాల్గొన్నారు.