స్టేషన్​ఘన్​పూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే ధ్యేయమని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం హైదరాబాద్ లోని నీటిపారుదలశాఖ ఆఫీస్​లో ఆయన ఈఎన్​సీ నాగేందర్​రావుతో కలిసి నియోజకవర్గంలోని దేవాదుల కాలువలు, తూముల పూడికతీత, అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని కోరారు. కెనాల్స్, తూములకు తక్షణమే రిపేర్ చేయాలని ఈఎన్​సీని కోరారు.

స్టేషన్​ఘన్​పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ వరకు ఉన్న మెయిన్ కెనాల్, అశ్వరావుపల్లి రైట్ మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీల్లో పేరుకుపోయిన పూడికతీతను తొలగించాలని, డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్టేషన్​ఘన్​పూర్ మండలంలోని పాంనూరులోని బంజరుమాటు నిర్మాణానికి పంపించిన ప్రతిపాదనలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. జఫర్​గఢ్ మండలంలోని థంసా చెరువుకు ఫాడర్ చానల్​ను నిర్మించాలన్నారు. ఈన్​ఎసీ నాగేందర్​రావు మాట్లాడుతూ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అనుమతులు తీసుకుని నిర్దేశించిన గడువులోగా పనులు చేయాలని దేవాదుల సీఈని ఆదేశించారు.