పార్టీ ఫిరాయింపుల ఇష్యూ: హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయింపుల ఇష్యూ: హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

వరంగల్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంక్రటావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హై కోర్టు ఇవాళ (సెప్టెంబర్ 9) తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించిన హైకోర్టు.. లేదంటే ఈ ఇష్యూను సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

 అనంతరం ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హై కోర్టు తీర్పు మీడియా ద్వారా తెలిసిందని.. తాను ఇంకా పూర్తి జడ్జిమెంట్‎ను చూడలేదని తెలిపారు. ఏది ఏమైనా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఈ వ్యవహారంలో అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్‎కు అప్పీల్‎కు వెళ్తామని.. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read :- హైదరాబాదీలు బీ అలర్ట్

 గతంలో పక్క రాష్ట్రాలలో కూడా కోర్టులు ఈ తరహా తీర్పులు ఇచ్చాయని.. ఫిరాయింపులపై ఒక్కో  కోర్టు ఒక్కో  తీర్పులు ఇస్తున్నాయని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై  విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ నేతలే పార్టీ ఫిరాయింపులకు మూల కారకులని ఫైర్ అయ్యారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర బీఆర్ఎస్‌దని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.