పల్లా, రాజయ్య.. నా భూకబ్జా నిరూపించాలే.. లేదంటే నా దగ్గర గులాంగిరీ చేయాలే : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పల్లా, రాజయ్య.. నా భూకబ్జా నిరూపించాలే.. లేదంటే నా దగ్గర గులాంగిరీ చేయాలే : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
  • ఒక్క గుంట భూకబ్జా చేసినట్లు నిరూపించినా వారి దగ్గర గులాంగిరీ చేస్తా 
  • ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్‍, వెలుగు: స్టేషన్‍ ఘన్‍పూర్‍ నియోజకవర్గంలోని దేవునూర్‍ గుట్ట చుట్టూ ఉన్న గ్రామాల్లో తమ కుటుంబం ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా.. తాను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‍రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇండ్లలో గులాంగిరీ చేస్తానని, నిరూపించని పక్షంలో ఇద్దరూ తన వద్ద గులాం చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్​ విసిరారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. బీఆర్‍ఎస్‍ నేతలకు పౌరుషం,  చీము, నెత్తురు ఉంటే తన సవాల్‍ స్వీకరించాలన్నారు.

మంగళవారం గ్రేటర్‍ కాంగ్రెస్‍ భవన్​లో కాంగ్రెస్‍ హనుమకొండ, వరంగల్‍ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి కడియం మీడియాతో మాట్లాడారు. బీఆర్‍ఎస్‍ పార్టీకి చెందిన పేపర్‍, ఛానల్‍, సోషల్‍ మీడియా ద్వారా పల్లా, తాటికొండ గడిచిన మూడు, నాలుగు రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను 2 వేల ఎకరాల ఫారెస్ట్  భూమి కబ్జా చేశానని మొన్న మాట్లాడిన పల్లా రాజేశ్వర్‍రెడ్డి.. నిన్న 50 ఎకరాలంటూ వెధవ మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసత్య ప్రచారాలు చేసిన పేపర్‍, ఛానళ్లపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. దేవునూర్‍ చుట్టూరా ఆరు గ్రామాల్లో అటవీ శాఖకు 3,750 ఎకరాల భూములు ఉండాల్సి ఉండగా.. వారి ఆధీనంలో అంతకంటే ఎక్కువగా 3,955 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు చేపట్టిన ఉమ్మడి సర్వేలో తేలిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాదారులుగా ఉన్న 23 మంది రైతులు తనను ఆశ్రయించి ఫారెస్ట్ అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని చెబితే.. సర్వే చేయాలని కలెక్టర్​తో మాట్లాడినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేగా తాను ఫారెస్ట్ భూములు కాపాడడంతో పాటు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానన్నారు. దేవునూర్‍ గుట్టలను ఎకో టూరిజం హబ్‍గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే డీపీఆర్‍ సిద్ధం చేయాలని జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి అధికారులను ఆదేశించారని చెప్పారు.