
వరంగల్ లో తాను పెద్ద లీడర్ ను కాబట్టే తనను టార్గెట్ చేస్తున్నారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎమ్మెల్సీ గా సుదీర్ఘంగా పనిచేసిన సీనియర్ లీడర్ గా తనను టార్గెట్ చేయడం సహజమన్నారు కడియం శ్రీహరి.
తన 30 ఎండ్ల రాజకీయ జీవితంలో ఒక్క అంగుళం భూమి కూడా కబ్జా చేయలేదన్నారు. తాను దేవునూరు అటవీ భూమిని అక్రమించినట్టు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే తన ఇంట్లో పల్లా, రాజయ్య ఇద్దరూ గులాంగిరి చేయాలన్నారు. ఉప ఎన్నికలు వస్తే రానివ్వండి.తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కడియం. లేదంటే తాను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు పల్లా, రాజయ్య సిద్ధంగా ఉండాలన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు కడియం శ్రీహరి.
►ALSO READ | బనకచర్ల సీక్రెట్.. జీబీ లింక్‌తో తెలంగాణకు ముంపు ముప్పు
మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. దేవనూరు అటవీ భూములను నా కుటుంబ సభ్యులు కబ్జా చేశారని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా, మాజీ ఎమ్మెల్యే రాజయ్య నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రైతుల పట్టా భూములను కాపాడాలని ప్రయత్నాలు చేస్తుంటే నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. నిరాధార వార్తలపై వివరణ ఇవ్వాలంటే నాకే సిగ్గనిపిస్తోంది. ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలి.
బీఆర్ఎస్ ఛానెల్స్ మాత్రమే నాపై ఆరోపణలు చేస్తున్నాయి. నా మంచి తనాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. 30 యేండ్ల రాజకీయ జీవితంలో గుంట భూమి కూడా కబ్జా చేయలేదు. దేవగిరి గుట్టల చుట్టూ ఆరు గ్రామాలు ఉన్నాయి. 1967లో సుమారు 3750 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని డ్రాఫ్ట్ సిద్దం చేసారు. ఆ డ్రాఫ్ట్ పై ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఫారెస్ట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో లేని పట్టా భూములను సైతం ఫారెస్ట్ అధికారులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. రైతుల కోసం కలెక్టర్ వద్దకు వెళ్లి జాయింట్ సర్వే చేయాలని కోరాను. రైతుల భూములు రైతులకు దక్కాలని పోరాటం చేస్తున్నాను. భూములను కబ్జా చేయాలని కాదు అని అన్నారు.