సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు: స్టేషన్ ఘన్​పూర్​లో ఈనెల 16న సీఎం రేవంత్​ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని స్టేషన్ ఘన్​పూర్  ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జనగామ కలెక్టరేట్ లో కలెక్టర్ రిజ్వాన్​ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్​తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉందని, ఈనెల 14 సాయంత్రం లోపు శంకుస్థాపనలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలన్నారు.

 16న మధ్యాహ్నం 12 గంటలకు సీఎం ఘన్​పూర్ సభా స్థలికి చేరుకుంటారని 12:30 గంటల నుంచి ఒంటి గంట వరకు శంకుస్థాపనలు, 2:30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సభకు సంబంధించి డయాస్, సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వీవీఐపీ పార్కింగ్, ఆయా మండలాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని పోలీసులకు సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రోహిత్​ సింగ్, పింకేశ్​కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

స్టేషన్ ఘనపూర్ పై సీఎంకి అభిమానం..

స్టేషన్ ఘనపూర్ : సీఎం రేవంత్ రెడ్డికి స్టేషన్ ఘనపూర్ పై అంతులేని అభిమానమని, అందులో భాగంగా నియోజక అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. స్టేషన్ ఘనపూర్ క్యాంప్ ఆఫీస్ లో మండల కాంగ్రెస్ శ్రేణులతో సీఎం బహిరంగ సభ విజయవంతానికి సన్నాహక మీటింగ్ మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 16న జరుగనున్న సీఎం సభకు నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి 50 వేలకు తగ్గకుండా జనసమీకరణ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, రాపోలు మధుసూదన్ రెడ్డి, బెలిడే వెంకన్న, మండలాధ్యక్షుడు జులుకుంట్ల శిరీశ్ రెడ్డి, ఇనుగాల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.