నిజాయితీతో పనిచేస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నిజాయితీతో పనిచేస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ప్రజల నమ్మకాన్ని శిరసావహిస్తూ, నిజాయితీతో పనిచేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ డివిజన్ కేంద్రంలోని క్యాంప్​ఆఫీస్​లో సోమవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తొలివిడత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ మంజూరులో స్టేషన్​ఘన్​పూర్ నియోజకవర్గం ఉందన్నారు.

దాదాపుగా రూ.150-200 కోట్లతో స్కూల్​నిర్మిస్తామన్నారు. డివిజన్​కేంద్రం స్టేషన్​ఘన్​పూర్​లో 100 పడకల ఆస్పత్రి మంజూరు చేయాలని సీఎం రేవంత్​రెడ్డికి వినతిచేయగా, సానుకూలంగా స్పందిస్తూ మంజూరు చేస్తూ జీవో జారీచేశారని తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని చెప్పారు. స్టేషన్​ఘన్​పూర్​కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. వచ్చే ఏడాది నుంచి క్లాసులు ప్రారంభిస్తారన్నారు.

స్థానికంగా ఆర్డీవో ఆఫీస్, తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర ప్రభుత్వ ఆఫీసులన్నీ ఒకేచోట ఉండేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​ఆఫీసుల కాంప్లెక్స్​ నిర్మాణానికి నిధులు రూ.26 కోట్లు, స్టేషన్​ఘన్​పూర్ శివారు ఇందిరానగర్​నుంచి మల్లన్నగండి రిజర్వాయర్​వరకు ప్రస్తుతమున్న సింగిల్​రోడ్డును డబుల్​రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్​మారజోడు రాంబాబు, ఏఎంసీ చైర్​పర్సన్​ జూలకుంట్ల లావణ్యాశిరీశ్​రెడ్డి, వైస్ చైర్మన్​నూకల ఐలయ్య, చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్​ పొట్లపల్లి శ్రీధర్​రావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.