హైదరాబాద్‌లో నీట మునిగిన విల్లాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే

హైదరాబాద్‌లో నీట మునిగిన విల్లాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే

హైదరాబాద్‌లో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శంకరపల్లి మండల పరిధిలోని లా ఫలోమా గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాలు నీట మునిగాయి. గేటెడ్ కమ్యూనిటీలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. విల్లాల ముందు పార్కు చేసిన కార్లు, బైకులు వరద నీటిలో తేలియాడుతున్నాయి.

పరామర్శించిన ఎమ్మెల్యే

నీట మునిగిన ఫలోమా గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య సందర్శించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న చెరువుల నుండి వచ్చే నీటిని దారి మళ్లించి 'రైచందని' పేరుతో విల్లాస్ నిర్మిస్తున్న వారు ప్రహరీ నిర్మించడంతో వరద నీరు వెళ్లేందుకు మార్గం లేక ఫలోమా గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శంకరపల్లి తహసిల్దార్, ఎంపీడీవో, ఇరిగేషన్ అధికారులు తక్షణ చర్యగా నీటిని బయటికి వెళ్లే మార్గాన్ని అన్వేషిస్తున్నారని ఆయన తెలిపారు.

212 విల్లాలు.. వెయ్యి మంది జనాభా

లా ఫలోమా గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 200కిపైగా విల్లాలు ఉండగా.. దాదాపు వెయ్యి మంది నివసిస్తున్నారు. ఒక్కో విల్లా విలువ ఎంత లేదన్నా 2 నుంచి 3 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. అంత పెట్టి కొనుగోలు చేసినప్పటికీ యజమానులకు బాధలు తప్పడం లేదు. వర్షం పడిన ప్రతీసారి తమ విల్లాల ముందు స్విమ్మింగ్ పూల్స్ దర్శనమిస్తాయని కమ్యూనిటీ వాసులు వాపోతున్నారు.