పాలిటిక్స్ లో వారసులను తెరమీదికి తేవడం కామనే. అయితే.. తండ్రి యాక్టివ్ గా ఉన్నా కొడుకు రంగంలో ఉండడంపై కోరుట్ల బీఆర్ఎస్ లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్ రావు రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. అయితే.. ఈసారి కోరుట్ల బరిలో తానే ఉంటానన్నట్లుగా సంజయ్ సంకేతాలిస్తుండడమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా తండ్రి ఎంకరేజ్ చేయడం వరకు ఓకే గానీ.. ఎలక్షన్ బరిలో ఉంటారన్న ప్రచారంపైనే వేరే టాక్ నడుస్తోంది.
సంజయ్ రావును బరిలోకి దించడానికి తండ్రే ఎంకరేజ్ చేస్తున్నారంటూ కొడుకు సన్నిహిత వర్గం ప్రచారం చేస్తోంది. అయితే.. తానే బరిలో ఉండాలని విద్యాసాగర్ అనుకుంటున్నా.. కొడుకే కార్నర్ చేస్తున్నాడంటూ మరికొందరు లీడర్లు చెబుతున్నారు. తరచూ ప్రభుత్వ కార్యక్రమాల్లో.. ఎమ్మెల్యే స్థానంలో సంజయ్ ఉండడం వివాదం రేపింది. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు కూడా పోయాయి. తన రాజకీయం కోసం తండ్రి పదవిని వాడుకుంటున్నారని జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ కంప్లెయింట్ చేశారు. ప్రోటోకాల్ గాలికొదిలి పబ్లిసిటీ డ్రామాలని మండిపడ్డారు.
కొడుకు పాలిటిక్స్ పై జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే విద్యాసాగర్ వరకూ వెళ్లింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ కేడర్ కు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. ఈమధ్య జరిగిన మీటింగ్ లలో తాను పోటీ చేయట్లేదనీ, తన కొడుక్కే సపోర్ట్ చేయాలని ఆయన చెబుతున్నారట. దీనిపైనా సొంత పార్టీలో మరో చర్చ మొదలైంది. ఇది ఆయన మనసులో మాట కాదని.. ఎమ్మెల్యే దగ్గరి మనుషులే చెబుతున్నారు. కొడుకు పేరే ప్రచారం జరుగుతుంటే... ఏం చేయాలో అర్థంకాకే సైలెంట్ అయిపోయారని వారు అంటున్నారు.
వరుసగా నాలుగుసార్లు కోరుట్ల ఎమ్మెల్యేగా గెలిచిన విద్యాసాగర్ రావుకు కేసీఆర్ ఫ్యామిలీతో బంధుత్వం ఉంది. కేటీఆర్, సంజయ్ రావుకు చదువుకునే రోజుల్లో దోస్తీ కూడా ఉంది. అయితే.. మంత్రి కేటీఆరే ఆయన కొడుకు సంజయ్ కు సపోర్ట్ చేస్తున్నారనీ, అందుకే ఎమ్మెల్యే మాట్లాడలేకపోతున్నారన్నది ఆయన సన్నిహితుల మాట. ఐదోసారి బరిలో ఉండాలనే ఉన్నా బయటపడట్లేదని చెబుతున్నారు.
మరోవైపు సంజయ్ అధికారిక కార్యక్రమాలతో పాటు ఆఫీసర్లతో రివ్యూలు కూడా చేయడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు దూరంగా ఉంటున్నారట. వేరే కార్యక్రమాలతో జనంలోకి పోయే ప్రయత్నం చేస్తున్నారు.