మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ : కంచర్ల భూపాల్‌రెడ్డి

  • కేటీఆర్‌‌ పర్యటనను సక్సెస్ చేయండి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నల్గొండ, వెలుగు : 2018 ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తే నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మాటను సీఎం కేసీఆర్‌‌ నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. ఆదివారం క్యాంపు ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్‌‌ ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్రాన్ని రూ. 1300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, సోమవారం రూ. 915 కోట్ల పనులకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని వెల్లడించారు.  

గతంలో అధికారంలోకి ఉన్న నాయకులు ఐటీ హబ్‌ తెస్తామని ఓట్లు వేయించుకొని ఐటీ మంత్రి పదవి తెచ్చుకున్నారని విమర్శించారు.  మెడికల్ కాలేజీ,  బత్తాయి మార్కెట్, జూస్‌ ఫ్యాక్టరీ, అండర్‌‌ గ్రౌండ్ డ్రైనేజీ విషయంలోనూ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.  బీఆర్‌‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రజలు 30 ఏళ్లుగా గోస పడుతున్న తాగునీటి సమస్య శాశ్వతంగా తీర్చామన్నారు. రూ. 90 కోట్లతో ఏడాది కింద మొదలు పెట్టిన ఐటీహబ్‌తో పాటు రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. అలాగే రూ. 234 కోట్లతో చేపట్టిన ఉదయసముద్రం ట్యాంక్‌ బండ్, నెక్లెస్‌ రోడ్డు, బోటింగ్‌,  కళాభారతి తదితర పనులకు శంకుస్థాపన చేయనున్నారని వివరించారు. 

 రూ. 36 కోట్లతో ఎన్‌జీ కాలేజీ  బిల్డింగ్, రూ. 110 కోట్లతో  మెడికల్‌ కాలేజీ నిర్మాణమవుతోందని చెప్పారు.  సాయంత్రం ఎన్‌జీ  కాలేజీలో బహిరంగ సభ ఉంటుందని కార్యకర్తలు, ప్రజలు పెద్దు ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ చీర పంకజ్‌ యాదవ్, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్ గౌడ్, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అభిమన్యు శ్రీనివాస్, నాయకులు కటికం సత్తయ్య గౌడ్, బక్క పిచ్చయ్య, సింగం రాంమోహన్, నిరంజన్‌వలీ, శరణ్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.