కరీంనగర్: మూడేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ తెలంగాణ సీఎం అవుతారని బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోన్న అధికారులను ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించాడు. అధికారంలో ఉన్న పదేళ్లు పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశాడని కౌశిక్ రెడ్డి ప్రశ్నించాడు. ఆదివారం (జనవరి 12) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం హాట్ హాట్ సాగింది. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు.
‘‘నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ’’ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశాడు. దీంతో ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పరస్పరం తోసుకున్నారు. పోలీసులు కౌశిక్ రెడ్డిని బయటకు లాకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయట మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగింది. మిగితా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశానని పేర్కొన్నారు.
ALSO READ | కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్: మంత్రుల ముందే ఎమ్మెల్యేల కొట్లాట
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 18,500 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చామని.. పెండింగ్ లో ఉన్న రెండో విడత దళిత బంధు నిధులు కూడా ఇవ్వాలని కోరానని అన్నారు. మీరు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరు లేరని.. రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు రూ.15 వేల రైతు భరోసా ఇవ్వాల్సిందేనని ఢిమాండ్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్కు అమ్ముడుపోయారని.. ఎమ్మెల్యే పదవి సంజయ్ కి కేసీఆర్ పెట్టిన భిక్ష అని.. దమ్ముంటే సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.