వివాదంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి

  • న్యూ ఇయర్ వేడుకల్లో మహిళా లీడర్​తో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు
  • ఆమె చెల్లెలిలాంటిదని వివరణ
  • ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన ఫొటో రిలీజ్ చేసిన కాంగ్రెస్ లీడర్లు

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ డీసీసీ భవన్​లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఓ మహిళా లీడర్ తో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేక్ కట్ చేసి ఆమె ముఖానికి పూసేందుకు ప్రయత్నించడం, ఆమె చేతులు పట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో మంగళవారం వైరల్ గా మారాయి. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్​లోని జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో డిసెంబర్ 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. కేక్ కట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే కవ్వంపల్లి తన పక్కనే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్​ను పక్కకు జరిపి అక్కడున్న ఓ మ‌హిళా లీడర్ ముఖానికి కేక్ పూసేందుకు ప్రయత్నించారు. ఆమె ఇబ్బందిగా ఫీలై తన ముఖం తిప్పుకున్నా మరోసారి అలాగే పూయబోయడం వీడియోలో రికార్డయ్యింది. కేక్ కటింగ్ తర్వాత డ్యాన్స్ చేసేటప్పుడు కూడా సదరు మహిళా లీడర్ చేయిపట్టుకుని ఎమ్మెల్యే స్టెప్పులేశారు. మళ్లీ రెండు చేతులు పట్టుకుని డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆమె నా చెల్లెలిలాంటిది : ఎమ్మెల్యే కవ్వంపల్లి

ఈ విషయమై మానకొండూరు ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణను వివరణ కోరగా.. సదరు మహిళా నేత తనకు చెల్లెలిలాంటిదని వివరణ ఇచ్చారు. తన క్యారెక్టర్ గురించి జిల్లా ప్రజలకు 20 ఏండ్లుగా తెలుసని, ఇలాంటి చిల్లర ప్రచారాన్ని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ వెల్లడిస్తానని  చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో రాఖీ పండుగ రోజు సదరు మహిళా నేత రాఖీ కట్టిన ఫొటోను కాంగ్రెస్ నాయకులు  రిలీజ్ చేశారు.