గత ప్రభుత్వంలో వడ్ల దోపిడీపై సీబీసీఐడీ ఎంక్వయిరీ జరిపిస్తాం

గత ప్రభుత్వంలో వడ్ల దోపిడీపై సీబీసీఐడీ ఎంక్వయిరీ జరిపిస్తాం
  •     పదేండ్లలో సుమారు రూ.700 కోట్లు దండుకున్నరు
  •     రైతుల శ్రమను దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు 
  •     జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​లో ఎమ్మెల్యే పీఎస్సార్ 
  •     పత్తి విత్తనాల బ్లాక్​ మార్కెటింగ్​పై రిపోర్టుకు ఆదేశం
  •     చివరి సమావేశంలో సమస్యలు ఏకరువు పెట్టిన సభ్యులు 

మంచిర్యాల, వెలుగు :  గత ప్రభుత్వ హయాంలో వడ్ల కొనుగోళ్లలో భారీ స్కామ్​జరిగిందని, తరుగు పేరుతో క్వింటాలుకు పది, పన్నెండు కిలోలు కట్​చేశారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు అన్నారు. గత పదేండ్లలో ఒక్క మంచిర్యాల నియోజకవర్గంలోనే దాదాపు రూ.700 కోట్లు దండుకున్నారని, ఈ పైసలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే దానిపై సీబీసీఐడీతో ఎంక్వయిరీ జరిపిస్తామని వెల్లడించారు.

రైతుల కష్టాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన ప్రతిపాదన మేరకు వడ్ల దోపిడీపై సీబీసీఐడీ ఎంక్వయిరీ కోరుతూ తీర్మానం చేశారు. జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్​లో మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్​ ఎమ్మెల్యేలు ప్రేమ్​సాగర్​రావు, గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు, అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్, జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్(డీఎఫ్​వో) శివ్​ఆశిశ్​ సింగ్, జడ్పీ సీఈవో గణపతి పాల్గొన్నారు.  

అగ్రికల్చర్​ఆఫీసర్ల చర్యలేవి?

రూ.860కు అమ్మాల్సిన పత్తి విత్తనాలను వ్యాపారులు బ్లాక్​ చేసి రూ.1400 దాకా అమ్ముతున్నారని, అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్సెట్టిపేట జడ్పీటీసీ మెంబర్ ​ముత్తె సత్తయ్య జిల్లా ఇన్​చార్జి అగ్రికల్చర్​ఆఫీసర్ సురేఖను ప్రశ్నించారు. స్పందించిన పీఎస్సార్​ పత్తి విత్తనాలను ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించేంది లేదన్నారు. రైతులను ఎంక్వయిరీ చేసి మూడ్రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని, బాధ్యులపై క్రిమినల్​కేసులు పెట్టాలని డీఏవోను ఆదేశించారు. ఈ ఏడాది యాసంగి సీజన్​లో వడ్లు దించుకోని మిల్లర్లపై యాక్షన్​ తీసుకోవాలని సివిల్​సప్లయిస్​ డీఎం గోపాల్​కు సూచించారు. 

పోడు రైతులపై దాడులు చేస్తే సహించేది లేదు

ఫారెస్ట్​ఆఫీసర్లు పోడు రైతులపై దాడులు చేస్తే సహించేది లేదని ఖానాపూర్​ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గత ప్రభుత్వం పోడు రైతులకు తక్కువ విస్తీర్ణంలో పట్టాలు ఇచ్చిందన్నారు. పదెకరాలు ఉన్న ఓ రైతుకు మూడు నాలుగు ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చిందన్నారు. దీంతో మిగతా భూమి ఫారెస్ట్​ది అంటూ పంటలు ధ్వంసం చేస్తూ, దాడులు చేస్తున్నారని ఫైర్​అయ్యారు. పాత పట్టాల ప్రకారం రైతులు సాగు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు.

లేదంటే ఆఫీసర్ల యాక్షన్ ఎట్లా ఉంటుందో ప్రజల రియాక్షన్ కూడా అదేవిధంగా ఉంటుందని వార్నింగ్​ ఇచ్చారు. కవ్వాల్​ ఫారెస్ట్​లోని మూడు చెక్​పోస్టుల్లో హెవీ వెహికల్స్​కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని, ఈ అక్రమ దందాను కంట్రోల్​చేయాలని డీఎఫ్​వో శివ్ ​ఆశిశ్​ సింగ్​ను కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

కవ్వాల్​లో హెవీ వెహికల్స్​ను అనుమతించాలి

కవ్వాల్​ రిజర్వ్ ​ఫారెస్ట్​ మీదుగా జన్నారం వరకు రాత్రి వేళల్లో కూడా హెవీ వెహికల్స్​ను అనుమతించాలని జన్నారం జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ ​డీఎఫ్​వోను కోరారు. సాయంత్రం 5 గంటలకే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారని, దీంతో జన్నారం రావాల్సిన వాహనాలు ధర్మపురి మీదుగా తిరిగి రావడం వల్ల 50 కిలోమీటర్ల దూరాభారం పడుతోందన్నారు. జన్నారం రేంజ్​లో ఖాళీగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. లక్సెట్టిపేట నుంచి తలమల, హజీపూర్ నుంచి ర్యాలీ రోడ్లకు ఫారెస్ట్​పర్మిషన్లు ఇవ్వాలని ముత్తె సత్తయ్య కోరారు. నెన్నెల మండలం కొత్తూరులో అడవి పంది దాడిలో గాయపడ్డ వ్యక్తికి ఇంతవరకు పరిహారం రాలేదని ఆ మండల ఎంపీపీ డీఎఫ్​వో దృష్టికి తీసుకురాగా త్వరలోనే అందిస్తామని తెలిపారు. 

గన్నీ బ్యాగుల కొనుగోళ్లలో అక్రమాలు

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన గన్నీ బ్యాగుల సప్లయ్​లో సివిల్​సప్లయీస్​ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ముత్తె సత్తయ్య, జడ్పీ వైస్ ​చైర్మన్​ తొంగల సత్యనారాయణ ఆరోపించారు. ప్రతి సమావేశంలో గన్నీ బ్యాగుల లెక్కలు అడుగుతున్నా ఎందుకు చెప్పడం లేదని డీఎం గోపాల్​ను నిలదీశారు. మిల్లర్లు వడ్లు అమ్ముకొని రేషన్​ బియ్యాన్ని రీసైక్లింగ్​ చేస్తూ సీఎమ్మార్​పె డుతున్నారని ఆరోపించారు.

ఏకంగా ఎంఎల్ఎస్​ పాయింట్ల నుంచే రీసైక్లింగ్​ జరుగుతుంటే అధికారులు మిల్లులపై ఎందుకు కేసులు పెట్టడంలేదని ప్రశ్నించారు. కొనుగోలు సెంటర్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. వేలాది మంది గొల్లకురుమలు రెండో విడత గొర్రెల కోసం డీడీలు కట్టి ఏండ్లుగా ఎదురుచూస్తున్నారని..వాళ్లకు గొర్రెలు ఇస్తరా, డీడీ పైసలు వాపస్ ​ఇస్తరా చెప్పాలని జిల్లా పశువైద్యాధికారి రమేశ్​ను ప్రశ్నించారు.

అడిషనల్​ కలెక్టర్​కు మెమోరాండం

గవర్నమెంట్​ జనరల్ ​హాస్పిటల్​తో పాటు సీహెచ్​సీలు, పీహెచ్​సీల్లో శానిటేషన్ అధ్వానంగా తయారైందని సభ్యులు ఆరోపించారు. మెడికల్​హెల్త్​ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు సూచించారు.  జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా మండలాల్లో నెలకొన్ని సమస్యలను ప్రస్తావించి త్వరగా పరిష్కరించాలని కోరారు. పెండింగ్ ​శాలరీస్​ను సాంక్షన్​ చేయాలని అడిషనల్​ కలెక్టర్ ​రాహుల్​కు మెమోరాండం అందించారు.