- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్
మంచిర్యాల, వెలుగు : పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పీఎస్సార్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి రోడ్‌లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది.
మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరుకాగా, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, డాక్టర్వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, బి.వెంకట్రావు హాజరయ్యారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పీఎస్సార్ మాట్లాడుతూ.. యువకుడు, విద్యావంతుడు, ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చిన వంశీకృష్ణను పార్టీ హైకమాండ్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిందన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలం ఆయనకు మద్దతిచ్చి గెలిపించడానికి ముందుకొచ్చామన్నారు.
వంశీని చూస్తుంటే వాళ్ల తాత కాకా వెంకటస్వామిని చూసినట్టు ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం చూస్తుంటే వంశీకృష్ణ గెలుపు ఖాయమైందన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఓవైపు రైతుబంధు ఇచ్చి మరోవైపు వడ్ల తరుగు పేరుతో రైతులను దోచుకున్నారని పీఎస్సార్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ దోపిడీని అరికట్టామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గూడెం లిఫ్టు ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడామన్నారు.
వంద రోజుల్లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే నియోజకవర్గంలో రూ.200 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి పలు అభివృద్ధి చేపడుతున్నామని ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. 280 స్కూళ్లకు రూ.32 కోట్లు మంజూరు చేశామన్నారు. గత 20 ఏండ్లలో చేయని పనులను ఈ వంద రోజుల్లోనే చేపట్టామన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తల్చుకుంటే బీఆర్ఎస్, బీజేపీ వాళ్లు తట్టుకోలేరని హెచ్చరించారు. కేసీఆర్ ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని, తమ మేనిఫెస్టో గురించి అడిగే హక్కు ఆయనకు లేదన్నారు.
కరకట్టలు నిర్మించాలి
ఎల్లంపల్లి ప్రాజెక్టుతో 18 గ్రామాల ప్రజలు నిర్వాసితులు అయ్యారని పీఎస్సార్ తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో మంచిర్యాల మునుగుతోందన్నారు. ముంపు నుంచి రక్షణకు కరకట్టలు నిర్మించాలని, ఎంసీహెచ్‌ను ఐబీలో నిర్మించడానికి, మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు జిల్లా కేంద్రంలో మరో రెండు ఫ్లై ఓవర్లు కోసం సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరగా
ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రేమ్‌సాగర్‌రావు మాట ఇస్తే తప్పే మనిషి కాదని, తాను అనుకున్నది సాధించడానికి ఎవరిరైనా ప్రశ్నించే తత్వం ఆయనదని ప్రశంసించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రేమ్‌సాగర్‌రావు ఆదేశాల మేరకు వంశీకృష్ణను లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపిస్తామన్నారు.