మంచిర్యాలను హెల్త్​ హబ్​గా ​మారుస్తా : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

  • ఐబీలోని ఇంటిగ్రేటెడ్​మార్కెట్​ను ఎంసీహెచ్​గా మారుస్తా
  • ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని హెల్త్ హబ్ గా మార్చి రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐబీ స్థలంలో అనాలోచితంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్​మార్కెట్​బిల్డింగ్​ను ఎంసీహెచ్​గా మారుస్తానన్నారు.

ఐటీఐ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​నిర్మిస్తామన్నారు. నియోజకవర్గంలో గంజాయి అమ్మకాలు, వినియోగం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నార్కో టీమ్, పోలీస్  బృందాలతో గంజాయి రవాణా, విక్రయాల ఆటకట్టిస్తామన్నారు. బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గూడెం లిఫ్ట్​ద్వారా సాగునీరు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, చెరువులను నింపడానికి చర్యలు తీసుకున్నామన్నారు. బీఆర్​ఎస్​ నుంచి కౌన్సిలర్లు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరి అధికార మార్పిడి కోరుకొని అవిశ్వాసానికి ముందుకు వచ్చారని వివరించారు. 

చెక్కులు పంపిణీ..

నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం తహసీల్దార్ ఆఫీసులో 15 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.