- వైన్స్ యజమానులకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వార్నింగ్
- ఉదయాన్నే పర్మిట్ రూంలో లిక్కర్ తాగుతున్న వారిని మందలించిన ఎమ్మెల్యే
- సాయంత్రం 5 తర్వాతే పర్మిట్ రూమ్‌కు పర్మిషన్ ఇవ్వాలని ఆదేశం
నల్గొండ (మునుగోడు), వెలుగు : బెల్ట్ షాపులకు లిక్కర్ అమ్మే వైన్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.మునుగోడును మద్యం, డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని, దాని ప్రకారం అందరూ నడుచుకోవాలని స్పష్టం చేశారు. మునుగోడు పరిధిలోని పలు వైన్స్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్మిట్ రూమ్‌లో మద్యం తాగుతున్న వారి వద్దకు వెళ్లి ‘ఇంత పొద్దున్నే మద్యం తాగితే ఎట్ల ? తాగుడుకు బానిసలైతే మీ కుటుంబాలు రోడ్డున పడ్తాయి’ అని మందలించాడు.
లిక్కర్ తాగుతున్న వారందరినీ బయటకు పంపించేశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాతే పర్మిట్ రూమ్‌లు తెరిచేలా పర్మిషన్ ఇవ్వాలని ఎక్సైజ్ ఆఫీసర్లను ఆదేశించారు. వైన్స్‌లో అమ్ముతున్న లిక్కర్ మంచిదేనా ? కల్తీదా ? అన్న అనుమానంతో బాటిళ్లపైన ఉన్న లేబుళ్లను పరిశీలించారు. అనంతరం ఎక్సైజ్ ఆఫీసర్లు, పోలీసులతో క్యాంప్ ఆఫీస్‌లో రివ్యూ నిర్వహించారు. తన నియోజకవర్గంలో యువత చెడు వ్యసనాల వైపు మళ్లితే సహించేది లేదని, తాను రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను తప్పనిసరిగా అమలుచేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు పట్టించుకోని వైన్స్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు.
15 రోజుల తర్వాత మరోసారి రివ్యూ నిర్వహిస్తానని, అప్పటిలోగా తాను సూచించిన మార్పులు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. గంజాయి, బెల్ట్ షాపుల నిర్మూలనపై రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని, ఏ గ్రామంలో ఎంత మంది తాగుడుకు బానిసలయ్యారు, ఎంత మంది యువత డ్రగ్స్, గంజాయికి అలవాటు పడ్డారు అనే వివరాలు నమోదు చేయాలని సూచించారు. బానిసలుగా మారిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మత్తు నుంచి బయటపడేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.