చౌటుప్పల్/ వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణిలో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు జైలుకెళ్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఇన్ చార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్ద మనుషులు ఉన్నా శిక్ష తప్పదని ఆయన చెప్పారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో చౌటుప్పల్ మునిసిపాలిటీకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బాబా షరీఫ్, సుల్తాన్ రాజు, బత్తుల వరలక్ష్మి, కొరగోని లింగస్వామి, బండమీది మల్లేష్, బొడిగె అరుణ, నల్గొండ నారాయణపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పుట్టపాక సర్పంచ్ భాస్కర్, వారి అనుచరులు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే రాజగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు మూకుమ్మడిగా ఓటు వేసి అధికారం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ఎదురుచూసిన ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరాశే మిగిల్చిందని విమర్శించారు. కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి చిక్కుకుందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫోన్లను బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని, కనీసం 14 సీట్లలో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మునిసిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డిరాజు, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమ తదితరులు పాల్గొన్నారు.
20 ఏండ్లు పవర్‌లోనే ఉంటాం
అధికారంలో ఉండగా కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన పాపాల పుట్టను ఒక్కొక్కటిగా తవ్వుతున్నామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, తమ కుటుంబం కోసమే వచ్చినట్టుగా పదేండ్ల పాటు కేసీఆర్, ఆయన కుటుంబం ఇష్టారాజ్యంగా పాలించిందని మండిపడ్డారు. మరో 20 ఏండ్ల పాటు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే పాలిస్తుందన్నారు. ఆగస్టు 15 లోపు కచ్చితంగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.