వర్షం నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మునుగోడు, వెలుగు: వర్షం నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మునుగోడు పట్టణంలోని పలు వీధుల్లో డ్రైనేజీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిలువడంతో దోమలకు నిలయంగా మారుతాయని, దీంతో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందన్నారు. డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలను కూల్చివేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు చెప్పారు.

అనంతరం ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపటి నుంచి గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎంపీడీవో పూజ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.  

గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే తనిఖీ 

చౌటుప్పల్, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల, వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  అనంతరం వనమహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. 

ప్రజలకు హాని చేసే కంపెనీలను ఉపేక్షించం

చౌటుప్పల్ వెలుగు : ప్రజలకు హాని కలిగించే కంపెనీలు ఉపేక్షించమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. దుర్వాసన వెదజల్లుతున్న ఐఎన్ ఆగ్రో వేటివ్ కంపెనీ మూసివేయాలని డిమాండ్​చేస్తూ సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆ కంపెనీ ఎదుట కౌన్సిలర్లు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ధర్నా వద్దకు చేరుకొని గ్రామస్తులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యం వెదజల్లె కంపెనీలతోపాటు రెడ్ జోన్ లో ఉన్న 12 కంపెనీలను త్వరలో మూసివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.