చండూరు, వెలుగు: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. సోమవారం నియోజకవర్గంలోని తన క్యాంప్ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్ల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు పట్టణంలోని రోడ్డు వెడల్పు పనులు, కచలాపురం, కిష్టాపురం, మునుగోడు నాంపల్లి రోడ్డు నిర్మాణ పనులు, నాంపల్లి నుంచి సాగర్ రోడ్డు వరకు జరిగే పనులు, కనగల్ మాల్ రోడ్డు మరమ్మతుల పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు జరిగేటప్పుడు ఏవైనా సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్కడక్కడ బిట్ల వారీగా చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నల్గొండ ఆర్ అండ్ బీ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, డీఈ సుధాకర్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.