కేసీఆర్, జగదీశ్ రెడ్డిని జైలుకు పంపిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

  •     ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

యాదాద్రి, వెలుగు :  అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని, గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని జైలుకు పంపిస్తామని భువనగిరి పార్లమెంట్ ఇన్​చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అలీబాబా దొంగల ముఠాగా అభివర్ణించారు. సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని, లక్షల కోట్ల రూపాయలు దోచుకొని నాశనం చేశారని మండిపడ్డారు.

సింగరేణి ప్రాంతంలో నిర్మించాల్సిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను మిర్యాలగూడలో ఏర్పాటు చేయడంతోపాటు అంచనాలను పెంచారని తద్వారా రూ.10 వేల కోట్ల కుంభకోణానికి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించిన వారందరికీ రిటన్ గిఫ్ట్ ఇచ్చానని తెలిపారు. పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెడుతామన్నారు. ఇప్పటికే జైలుకు వెళ్లిన కవిత.. ఈసారి బతుకమ్మ పండుగ అక్కడే జరుపుకొంటారని ఎద్దేవా చేశారు.

సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు అండెం సంజీవ రెడ్డి, కుంభం కీర్తి రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పచ్చిమడ్ల శివరాజ్ గౌడ్, రామాంజనేయులు, తగళ్లపల్లి రవికుమార్, పొత్నక్ ప్రమోద్ కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.