- మోదీది రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి: అవినీతికి పాల్పడి వేల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని, జగదీశ్ రెడ్డిని జైలుకు పంపుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇవాళ భువనగిరి నియోజక వర్గ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో జగదీశ్ రెడ్డి 10 వేల కోట్ల కుంభ కోణానికి పాల్పడ్డాడని, త్వరలో జైలుకు పంపడం ఖాయమన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నుంచి11 మంది ఎమ్మెల్యేలుగా గెలిచామన్నారు. చేతగాని వారు ఎవ్వరో ప్రజలకు తెలుసనన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే జగదీశ్ రెడ్డి ని ఎక్కడా తిరగనివ్వబోమని హెచ్చరించారు. మునుగోడు ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను పెట్టి తనను ఓడగొట్టారని, ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి తో పెట్టుకుంటే ఏమవుతుందో చేసి చూపించానన్నారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర నరేంద్ర మోదీ చేస్తున్నాడని, అందుకే 400 ఎంపిలను గెలిపించాలని కోరుతున్నాడన్నారు. త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పా రు. విభజన హామీలపై ఏనాడు కూడా మాట్లాడని కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసాడని మండిపడ్డారు. అభివృద్ధే ధ్యేయంగా తాము ముందుకు సాగుతు న్నామని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డికి భువనగిరిలో లక్ష మెజారిటీ ఇవ్వాలన్నారు. 21న నామినేషన్ కు భారీ సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.