- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తుంగతుర్తి, వెలుగు : కాంగ్రెస్ పేదల పార్టీ అని, అనునిత్యం సంక్షేమం కోసం పని చేస్తుందని భువనగిరి పార్లమెంట్ ఇన్ చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్ ఆయన పాల్గొని మాట్లాడారు. కిరాయి ఇంట్లో ఉండే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దోచుకున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కల్వకుంట్ల కవిత ఈ ఏడాది జైల్లోనే బతుకమ్మ ఆడాలన్నారు. తప్పు చేసిన వారందరూ తప్పక శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో మనుగడ లేదని, మరో 20 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు.
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో శాసనసభ్యులు మందుల సామెల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడిపాటి నరసయ్య ,బాలలక్ష్మి, అనురాధ కిషన్ రావు, రాంబాబు, గంగరాజు అజయ్, కొండరాజు తదితరులు పాల్గొన్నారు.