నల్గొండ జిల్లాలో కరెంట్​ సమస్య పరిష్కారానికి రూ.57 కోట్లు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి 

 నల్గొండ జిల్లాలో కరెంట్​ సమస్య పరిష్కారానికి రూ.57 కోట్లు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి 

చండూరు, వెలుగు : గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి మునుగోడు నియోజకవర్గానికి రూ.57 కోట్ల నిధులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంజూరు చేయించారు. వీటిలో నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు, చండూరు మున్సిపాలిటీ, గట్టుప్పల్, మర్రిగూడెం, నాంపల్లి, మునుగోడు మండలాలకు రూ.37 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నారాయణపూర్, చౌటుప్పల్, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల నిధులు కేటాయించారు. సోమవారం హైదరాబాద్​లోని ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి నివాసంలో విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ పనులు మొదలు పెట్టాలని, మంజూరైన నిధులను విద్యుత్ పనులకు మొదటగా కేటాయించాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా లోవోల్టేజ్ సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఈ సుధీర్ కుమార్, చౌటుప్పల్ డీఈ విజయభాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.