చౌటుప్పల్​లో సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలి

  •     సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే, ఎంపీ, లాయర్లు 

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్​లో సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, లాయర్లు కోరారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్ లోని  సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖల కార్యాలయాలతోపాటు రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న చౌటుప్పల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే ఏకైక రెవెన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉందని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసిందన్నారు. వెంటనే సీఎం స్పందించి  లా సెక్రటరీకి ఫోన్ చేసి పరిశీలించమని ఆదేశించినట్లు తెలిపారు. సీఎంను  కలిసినవారిలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు పరమేశ్, జనరల్ సెక్రటరీ శ్రీను, కాంగ్రెస్​ నాయకులు, 40 మంది అడ్వకేట్లు  ఉన్నారు.