
హైదరాబాద్: అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రశాంతంగా ఫామ్ హౌజ్‌లో ఉన్నారని లేదంటే.. నిన్నటి దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా పరిస్థితి ఉండేదని హాట్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో 8 వేల హత్యలు.. లక్ష దొంగతనాలు జరిగాయని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అహంకారంతో సాగిందని.. తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని అన్నారు.
ALSO READ | అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం.. బీఆర్ఎస్ సభ్యులు.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్న భట్టి
పోలీస్ అధికారులు కూడా బీఆర్ఎస్ అధికార దాహానికి బలయ్యారని.. బీఆర్ఎస్ పెద్దలు చెప్పిన అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేయించిన పాపాలతో పోలీసులు విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పోలీసు వ్యవస్థను దారుణంగా వాడుకుందని ధ్వజమెత్తారు.
గతంలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు బీఆర్ఎస్ అవకాశమే ఇవ్వలేదని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పై ఎదురు దాడి చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి.. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేశాడు.. అలాంటిది పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఫార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు.