బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో చండూర్​ మున్సిపాల్టీ అభివృద్ది శూన్యం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లాచండూర్​ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పర్యటించారు.  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్చదనం- ...పచ్చదనం కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.  అనంతరం పాఠశాలలో మధ్యాహ్నభోజనం పథకం ఏర్పాట్లను పరిశీలించారు. ఇంకా మున్సిపాల్టీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అమృత్ పథకం లో భాగంగా చండూర్ లో 5 లక్షల లీటర్ల క్యాపాసిటి కలిగిన రెండు త్రాగునీటి ట్యాంక్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.... 2018లో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం వలన చండూరు అభివృద్ది ఆగిపోయిందన్నారు.  గతంలో జరిగిన
 మున్సిపాలిటీ ఎన్నికల్లో చండూరులో ప్రతి గల్లి తిరిగిన వ్యక్తి సాదక బాధలు తెలుసుకున్నాన్నారు.  ఇంకా ఈ ప్రాంతంలోని చేనేత కార్మికులు చాలా రకాల సమస్యల్లో కష్టాల్లో ఉన్నారని... వారు నమ్ముకున్న వృత్తి వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలో ఉంది కాబట్టి చండూర్​ ను అభివృద్ది చేసే బాధ్యతను తీసుకుంటానని ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి అన్నారు.
  వర్షాకాలం లో రోడ్ల పై మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్​ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.  చండూరు, చౌటుప్పల్​ మున్సిపాలిటీ పరిధిలో మురుగు కాలువల మరమ్మత్తులను పూర్తిచేయాలని అధికారులను కోరారు.  గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్​ లకు  చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని... కొన్ని పనులు మధ్యలోనే ఆపేశారని అలాంటి పనులకు వెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ది విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి..