చౌటుప్పల్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్అయ్యిందని, తాము వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధమయ్యారని, ఎంపీ టికెట్ ఇవ్వకపోయేసరికి మళ్లీ వెనుదిరిగి వెళ్లిపోయాడని చెప్పారు.
ఎంపీ ఎన్నికల ముందు హరీశ్ రావు కొత్తగా రాజీనామా డ్రామా మొదలు పెట్టాడని విమర్శించారు. గోదావరి జలాలను బస్వాపూర్ ప్రాజెక్టు ద్వారా తీసుకొచ్చేవరకు తాను నిద్రపోనని తెలిపారు. భూదాన్ పోచంపల్లిలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే బాధ్యత తమదేనన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవదని, బీఆర్ఎస్ కారు గ్యారేజ్ కు పోయిందని ఎద్దేవా చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నాయకుడు పున్న కైలాస్ నేత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నా జీవితం మునుగోడు ప్రజలకు అంకితం
చండూరు,( మర్రిగూడ) వెలుగు: నా జీవితం మునుగోడు ప్రజలకు అంకితమని, నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో మర్రిగూడ మండల కేంద్రంలో రోడ్ షో లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తానని మాట ఇచ్చానని, మీరు వేసే ప్రతి ఓటు రాజగోపాల్ రెడ్డికి వేసినట్లుగా భావిస్తానని తెలిపారు.
వచ్చే నాలుగేండ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్నేత, మునుగోడు నియోజకవర్గ కో–ఆర్డినేటర్ బొజ్జ సంధ్యారెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ కో–ఆర్డినేటర్ బాలలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.