అధికారుల తీరుపై ఎమ్మెల్యే కోనప్ప ఆగ్రహం

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజా సమస్యలను తీర్చలేనపుడు పదవిలో ఉన్నా లేకున్నా ఒక్కటేనని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. నియోజకవర్గంలో అధికారుల పనితీరు అధ్వానంగా మారిందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో ప్రజలు వాట్సాప్, ఫేస్ బుక్ లలో పోస్టులు పెడుతూ తమను, ప్రభుత్వాన్ని తిడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గురువారం ఆసిఫాబాద్​లో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ మీటింగ్ లో ఎమ్మెల్యే కోనప్ప అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని, ఇందుకు కారణం అధికారులేనని మండిపడ్డారు. కాగజ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి కాగజ్ నగర్ వరకు రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రజలంతా కలిసి శ్రమదానంతో మొరం వేసి రోడ్డుకు రిపేర్లు చేసేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వాలని కోరారు.

కాగజ్ నగర్ మండలంలోని అందెవెల్లి బ్రిడ్జ్ కూలిపోయి పదిహేను రోజులవుతోందని, 42 గ్రామాల్లోని 50 వేల మంది ఇబ్బంది పడుతున్నా కనీసం ప్రతిపాదనలు తయారు చేయలేదంటూ ఆర్ అండ్ బీ ఆఫీసర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన జడ్పీ మీటింగ్ లో కమలోద్దిన్ అనే కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పినా  అధికారులు పట్టించుకోలేదని, మళ్లీ అతనే తన నియోజకవర్గంలో కొత్తగా 10 బ్రిడ్జిల టెండర్లు దక్కించుకున్నాడన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్ ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని నిలదీశారు. రోడ్డు రిపేర్ల కోసం ప్రతిపాదనలు పంపిస్తే ఎన్ఓసీ  అధికారులు అభ్యంతరం చెప్పారని ఆఫీసర్లు చెప్పడంతో.. ప్రజల ఇబ్బందులు పట్టని ఎన్ఓసీ అధికారులు అన్నం తింటున్నారా..గడ్డి తింటున్నారా అంటూ ఫైర్ అయ్యారు. జిల్లాలో అధికారుల తీరు టు మచ్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు. సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, సీఈవో రత్నమాల, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.