- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: క్రీడాకారుల మాదిరిగానే కళాకారులను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. కళాకారులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కళానైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని కోరారు. బుధవారం రవీంద్ర భారతిలో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ప్రజాకళల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూనంనేని మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో సాయుధ పోరాటం, వెట్టిచాకిరీ నుంచి ప్రజాకళలు పుట్టుకొచ్చాయి.
సుద్దాల హనుమంతు, గద్దర్, గోరటి వెంకన్న వంటి కళాకారులు ప్రజానాట్యమండలి (పీఎన్ఎం) నుంచే వచ్చారు. గుమ్మడి వెంకటేశ్వర్లు, జమున, అల్లు రామలింగయ్య, మాదాల రంగారావు తదితర గొప్ప నటులను పీఎన్ఎం తీర్చిదిద్దింది. కళలు పేదరికంతో అల్లాడిపోవద్దు. మరణించ కూడదు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’’ అని కోరారు.