
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తక్కువ పెట్టుడితో ఎక్కువ దిగుబడి సాధించే విధానాలపై ఆఫీసర్లు, రైతులు దృష్టి పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆయిల్‌పామ్‌తో పాటు వివిధ రకాల పంటలు ఆధునిక పద్ధతిలో సాగు చేసేందుకు ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రెండు రోజులు పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్‌ను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బి.రోహిత్‌రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఉన్నారు.
నేడు మంత్రి రాక
హైదరాబాద్, వెలుగు : కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్న అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌కు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఎక్స్‌పోలోని స్టాల్స్‌ను సందర్శించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను తెలుసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో మంత్రి సూచించారు. యంత్రాలు, మేలైన విత్తనాల ప్రదర్శనతో పాటు సుస్థిర, సేంద్రీయ సాగు, ఉద్యానవన పంటలు, మత్స్య, పాడి పశువుల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామన్నారు.