హైదరాబాద్: పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ కొట్లాడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ (అక్టోబర్ 6) చైతన్య పురి ఫణిగిరి కాలనీ వెంకట సాయి నగర్లో మూసీ నిర్వాసితులతో కూనంనేని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన ఉద్దేశం మంచిదే కానీ.. నిర్వాసితులకు అది శాపంగా మారిందని అన్నారు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నియంతృత్వంగా వ్యవహరించరాదన్నారు. మూసీ నిర్వాసితులపై మంత్రులు ఇష్టం వచ్చినట్లు ప్రకటన చేస్తున్నారని.. దీంతో రాష్ట్రంలో పెద్ద గందరగోళం నెలకొన్నదన్నారు.
Also Read :- పవన్ టార్గెట్గా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్
మూసీ పరిసరాల్లో చాలా మంది లక్షల, కోట్ల రూపాయలతో భూములు కొనుక్కొని నిర్మాణాలు చేసుకున్నారన్న కూనంనేని.. భూములు అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ వీళ్ళ జీవితం అంత ఇండ్లకు తెచ్చిన లోన్లు కట్టేందుకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నివారణకు హైడ్రా ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూముల రక్షణ కోసం అంటున్నారు. హైడ్రా పేరుతో భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములలో ఇప్పటికే ఉన్న నిర్మాణాల జోలికి పోకూడదని కోరారు.