భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని ముర్రెడు వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించడంతోనే సమస్య పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్ కాలనీ, ఎదురుగడ్డ, గౌండ్ల రామవరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. శ్రీనగర్గ్రామపంచాయతీ ఆఫీస్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముర్రెడు వాగు ఉధృతితో కొత్తగూడెం పట్టణంతో పాటు లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు ఇండ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో తహసీల్దార్ కేవీ ప్రసాద్, ఎంపీడీవో చలపతి రావు, పీఆర్డీఈ రామకృష్ణ, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ వివలాల్, వెంకటస్వామి, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.