- ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ
కరీంనగర్: రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సిఎల్)లో ఉద్యోగం పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కుటుంబాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామంలో హరీష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుడు హరీష్ భార్యకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ బాధితుడు ముంజ హరీశ్ (32) గత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మరుసటి దినం కమాన్ పూర్ మండలం గుండారం వద్ద హరీశ్ డెడ్ బాడీ దొరికింది. ఉద్యోగం కోసం తన నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని, కొత్త కాంట్రాక్టర్ రాగానే తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని..దళారులను నమ్మి మోసపోయాయని.. తన ఆత్మహత్యతోనైనా తన లాంటి వారందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు హరీశ్ శుక్రవారం వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.