కోరుట్ల రూరల్, వెలుగు: ‘మీకు ఉచితంగా చేపపిల్లలు ఇచ్చినం.. గుడికాడికి రోడ్డు ఏపిచ్చినం.. లైట్లు వెట్టిచ్చినం.. కానీ ఎక్కడికేలో వచ్చినోనికి సపోర్ట్ చేస్తరా? ఎవడెవడు బీజేపీకి సపోర్ట్ చేస్తునడో వాళ్లను బొందపెడ్తనని చెప్పున్రి.. వాళ్లను గంగమ్మ తల్లే చూసుకుంటది.. చేపలు పట్టపోయినప్పుడు అదే చెర్ల ముంచుతది.. నేను వట్టోన్ని గాదు’ అంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు గంగపుత్రులకు శాపనార్థాలు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరుట్ల మండలం జోగినిపల్లిలో ఆదివారం గంగపుత్రులతో సమావేశమయ్యారు. కొందరు గంగపుత్రులు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని తెలుసుకొని ఆవేశంతో శాపనార్థాలు పెట్టారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది కాస్త వివాదాస్పదమైంది.
కించపర్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే
మెట్‌పల్లి : గంగపుత్రులను కించపర్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. మెట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ధర్మపురి అర్వింద్ కులమతాల మధ్య చిచ్చుపెట్టి నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు వైరల్ చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే అర్వింద్ఎల్లమ్మ తల్లికి చెప్పుల ముడుపు కడుతా అంటూ హిందువుల మనోభావాలు కించపరిచిన విషయం వాస్తవం కదా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను లొట్టపీసు చట్టాలు అంటూ దళితులను అవమానించాడన్నారు.