
- ప్రభుత్వంపై భిన్నమైన వ్యాఖ్యలు
- జెండా వివాదంపై క్షమాపణలు
- అంతకుముందు సీఎంను కలిసి, బీఆర్ఎస్హయాంలో నిధులు రాలేదని కామెంట్
సిద్దిపేట, వెలుగు: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ కు కారణమవుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్కిల్యూనివర్సిటీతోపాటు, రెండు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారు. స్కిల్యూనివర్సిటీ కోసం చీకోడులో గత శుక్రవారం అధికారులు సర్వే చేశారు. అయితే, ఎమ్మెల్యే ఇటీవల చేస్తున్న భిన్నమైన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
బీఆర్ఎస్ప్రభుత్వంలో నిధులు రాలేదని..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పదేళ్లు పని చేసినా ఎన్నడూ వివాదాల వైపు వెళ్లలేదు. కానీ, ఎమ్మెల్యే అయ్యాక తన స్వరం మార్చడం వెనక కారణాలేంటోనన్న చర్చ జరుగుతోంది. ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన మాజీ సీఎం కేసీఆర్‌ను కలవగా రజతోత్సవ సభకు జన సమీకరణ చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే ఈ నెల 2న ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దుబ్బాకకు నిధులు సరిగా రాలేదన్నారు. దీంతో, ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
ఎమ్మెల్యేలను కొనమన్నారట..
ఈ నెల 14న నిర్వహించిన బీఆర్ఎస్నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టండి.. పైసలిస్తాం.. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారని చెప్పారు. ఈ వాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రభుత్వంలోని పెద్దలు స్పందిస్తూ.. ఎంత మందిని కొంటారో కొనండని, కాంగ్రెస్సర్కారు ఏర్పడినప్పటి నుంచి పడగొడతామనే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుసటి రోజే ఎమ్మెల్యే మాట మార్చారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అనలేదని, ఆయా వర్గాల ప్రజల అభిప్రాయం మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు.
జెండా కింద పడేసి..
ఈ నెల 14న అంబేద్కర్ జయంతి రోజు ఎమ్మెల్యే దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. తర్వాత జెండాను కింద పడేశారు. దీన్ని వీడియో తీసినవారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు నిరసనలకు సిద్ధమవడంతో ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను కావాలని జెండాను అవమానించలేదని, కింద ఉన్న కార్యకర్తకు ఇచ్చానన్నారు. ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెబుతూ.. దళితుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు.
దూకుడు పెంచాలన్న ఆలోచనతోనే..
దుబ్బాక ఎమ్మెల్యే అయ్యాక కొత్త ప్రభాకర్ రెడ్డి వైఖరిలో క్రమంగా మార్పు వస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో దూకుడు పెంచాలన్న ఆలోచనతోనే ఆయన ఇలా చేస్తున్నారని అంటున్నారు. దీనికితోడు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో శ్రీనివాస్‌రెడ్డి జోక్యాన్ని ప్రభాకర్ రెడ్డి ఏ మాత్రం సహించలేకపోతున్నారని తెలుస్తోంది. మల్లన్న సాగర్ కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలే విషయాలపై ఇటీవల ఎక్కువగా మాట్లాడుతున్నారు. విమర్శలను తిప్పికొట్టడానికే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.