
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆసిఫాబాద్‌లోని అంబేద్కర్ చౌక్ వద్ద దిష్టిబొమ్మతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా లీడర్లు ఆత్రం సుగుణ, కుమ్రం వందన, కోవ ఇంద్ర, దుర్గం కళావతి, రాజేంద్ర కుమారి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే తన హోదా మరిచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్ గా పని చేసిన కోవ లక్ష్మి ఇలా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. డీసీసీ ప్రెసిడెంట్ తో పాటు ఆయన తల్లిని బూతులు తిట్టడం మహిళలకే సిగ్గు చేటన్నారు. త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్తారని, ఎమ్మెల్యే కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి అప్పట్లో 20 శాతం కమీషన్ తీసుకున్నారని, త్వరలోనే ఆధారాలతో బయట పెడతామని చెప్పారు. వెంటనే విశ్వప్రసాద్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆమె ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ద్వారా విశ్వప్రసాద్ రావుకు ప్రాణహాని ఉందని, ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఆమెదేనని పేర్కొన్నారు. ఇదిలాఉంటే సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా సందర్భంగా డీసీసీ అధ్యక్షుడితో పాటు నియోజకవర్గ ఇన్ చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ను తిట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.