ఆసిఫాబాద్​ కలెక్టరేట్​ ఎదుట ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా


 

  •     బీఆర్ఎస్​ లీడర్లను అసభ్యంగా తిడుతున్నారని ఆగ్రహం 
  •     ప్రజల్లో తేల్చుకుందాం రా అంటూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి సవాల్

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ ​జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఆదివారం మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు అసభ్య పదజాలంతో తిట్టాడని ఆసిఫాబాద్ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని తమ పార్టీ లీడర్లతో కలిసి ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ మంత్రి పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ పాటించలేదన్నారు. అభివృద్ధి చేస్తే సహకరిస్తామని, పెత్తనం చేసినా, చేయాలని చూసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 తేల్చుకోవాలనుకుంటే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యేగా ఉన్న తన పట్ల విశ్వప్రసాద్ రావు, నియోజకవర్గ ఇన్ చార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ అజమాయిషీ చెలాయించాలని చూస్తున్నారని..శ్యామ్ నాయక్​ను ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టడం, ప్రొటోకాల్ ​పాటించకపోవడం, ఎలాంటి పదవులు లేని వారిని స్టేజీపై కూర్చోబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారకులపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ దాసరి వేణుకు వినతిపత్రం అందజేశారు.