మిషన్​ భగీరథకు కోట్లు ఖర్చు చేసినా .. నా ఇంటికే చుక్క నీళ్లు రాలే : కోవ లక్ష్మి

  • బోర్లు వేయనీయడంలేదని ఫారెస్ట్​ అధికారులపై సభ్యుల ఫైర్
  • ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శలు
  • హాట్ హాట్​గా ఆసిఫాబాద్ జడ్పీ మీటింగ్

ఆసిఫాబాద్ వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని.. అయినా నాడు జడ్పీ చైర్​పర్సన్​గా, నేడు ఎమ్మెల్యేగా ఉన్న తన ఇంటికే చుక్క మంచి నీళ్లు రాలేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆ శాఖ అధికారులపై ఫైర్ అయ్యారు. ఇక గ్రామాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ అఫీసర్లు అన్ని పనులకు అడ్డం పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పోడు భూముల్లో బోర్ల వేస్తమంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నేతలు ప్రశ్నించారు.

ఆసిఫాబాద్​ కలెక్టరేట్​లో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హాట్​హాట్​గా సాగింది. కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు, జడ్పీ సీఈఓ రత్నమాల హాజరవగా 9 అంశాలపై దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. 

అధికారుల తీరుతో ప్రజలకు ఇబ్బందులు

 అధికారుల తీరుతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదని సభ్యులు మండిపడ్డారు. రూ.8082 కోట్లు ఖర్చు చేసినా కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు సాగు నీరు అందడం లేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తే ఫారెస్ట్ అధికారులు బోర్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తిర్యాణి మండల గుండాల, మంగి, గోపేరా గ్రామాల్లో ఫారెస్ట్ పర్మిషన్ లేక రోడ్డు పనులు కంప్లీట్ కావడం లేదన్నారు. జోడేఘాట్​లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు వెంటనే బిల్లులు ఇవ్వాలని కోరారు.

ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను పిలవకుండా ఆర్ అండ్ బీ అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావుతో ఎలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయిస్తారని ఈఈ పెద్దన్నను ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. తిర్యాణి మండలం సుంగపూర్ వద్ద  కిలోన్నర మీటరు రోడ్డు నిర్మాణానికి అడ్డుపడటం ఏమిటని డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్​ను ప్రశ్నించారు.

సమన్వయంతో పనులు పూర్తిచేయాలి: కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు అధికారులు సమాచారం ఇవ్వాలని, తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని సూచించారు. ఫిబ్రవరి 2న ఉమ్మడి జిల్లాకు రానున్న ముఖ్యమంత్రికి వివిధ అభివృద్ధి పనులు, అవసరమైన నిధులకు సంబంధించి నివేదిక అందిస్తామన్నారు.

ఫారెస్ట్ అధికారులపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తది

అటవీశాఖ అధికారులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రతి దానికి అడ్డంకులు సృష్టిస్తే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తదని ఎమ్మెల్సీ దండె విఠల్​హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. అధికారంలో లేని వాళ్లు, గతంలో పదవులు అనుభవించని వాళ్లు, ఓడిపోయిన వాళ్లు ఇచ్చే ఈజీఎఫ్ ప్రతిపాదనలు అధికారులు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రొటోకాల్ ప్రకారం పిలవడం అధికారుల నైతిక బాధ్యత అన్నారు.

ప్రైవేట్ వ్యాపారులతో  మార్కెట్ కమిటీ అధికారుల కుమ్మక్కుకంది పంట చేతికి వచ్చి రోజులు గడుస్తున్నా జిల్లాలో ఇప్పటి వరకు కందుల కొనుగోలు ప్రారంభించలేదని ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెలా మల్లికార్జున్ మండిపడ్డారు. రైతులు ఇప్పటికే 50 శాతం పంట ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారని, ఇంకెప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని మండిపడ్డారు.  అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని , నష్ట పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.