- తప్పుబట్టిన అధికార, ప్రతిపక్ష సభ్యులు
- బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నయ్: పొన్నం
- మేం ఏ పార్టీ పక్షం కాదు.. జనం పక్షమే: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీలో శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్షాల సంఖ్యా బలంపై ఆయన మాట్లాడుతూ.. అధికారపక్షం వైపు 65 మంది ఎమ్మెల్యేలుంటే తమవైపు 54 మంది ఎమ్మెల్యేలున్నారని వ్యాఖ్యానించారు. వారికి, తమకు కొంచెమే తేడా ఉందని, ప్రతిపక్షమేమీ తక్కువ లేదని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకూ ఎక్కువ టైమ్ ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఇటు అధికార పక్షంలోని నేతలు, అటు ప్రతిపక్షంలోని బీజేపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని కేటీఆర్ వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నదని అన్నారు.
అన్నీ కలిసిపోయాయని వారే చెప్పారని మండిపడ్డారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తననూ అధికార పక్షంలోనే బీఆర్ఎస్ వాళ్లు కలిపేశారని, కానీ, ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ఎవరితోనైనా తాను పోరాడుతానని తేల్చిచెప్పారు. తనను ఏదో ఒక వైపున ఉంచొద్దని కేటీఆర్కు హితవుపలికారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటేననే విషయం కేటీఆర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కల్పించుకున్నారు. తాము ఏ పార్టీతోనూ జట్టు కట్టలేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని, వారి కోసమే పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.