
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం తెలకపల్లి మండలం గౌరెడ్డి పల్లి, గట్టునెల్లికుదురు, నాగర్ కర్నూల్ మండలం పెద్దాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామన్నారు.
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ. 500 గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రెండు సార్లు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. గ్రామాల్లో ప్రధానంగా బస్ ప్రయాణం, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.