తిమ్మాపూర్‌‌కు రూ. 262.48 కోట్లు కావాలె : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

యాదాద్రి, వెలుగు : బస్వాపురం (నృసింహ సాగర్) రిజర్వాయర్ కారణంగా ముంపునకు గురవుతున్న బీఎన్​ తిమ్మాపూర్‌‌కు రూ. 262.48 కోట్లు అవసరమని ఆఫీసర్లు నివేదించారు. గురువారం కలెక్టరేట్లో భువనగిరి నియోజకవర్గంలోని రిజర్వాయర్​, కాలువ పెండింగ్​ పనులపై ఆఫీసర్లతో ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కర్​రావు రివ్యూ నిర్వహించారు. 

భూ సేకరణతో పాటు పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బస్వాపురం రిజర్వాయర్​ ముంపు గ్రామమైన బీఎన్​ తిమ్మాపూర్​లోని గ్రామ కంఠం భూసేకరణ చేయాల్సి ఉందని ఆఫీసర్లు తెలిపారు. ఇందుకోసం రూ. 110 కోట్లు, వ్యవసాయ భూములకు సంబంధించి రూ. 102.48 కోట్లు, నిర్వాసితులకు కోసం హుస్సేనాబాద్​లోని ఆర్​ అండ్​ ఆర్​ కాలనీ కోసం రూ. 50 కోట్లు అవసరమని వివరించారు. 

అదే విధంగా బస్వాపురం రిజర్వాయర్​, ప్యాకేజీ 16 కాలువ, భునాదిగాని కాలువ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, భీమలింగం కాలువల కోసం భూ సేకరణతో పాటు పెండింగ్​ పనులను వివరించారు. మీటింగ్​లో స్పెషల్ డిప్యూటీ​ కలెక్టర్​ నాగలక్ష్మి, ఎస్​ఈ శ్రీనివాస్​, ఆర్డీవోలు జగన్నాథరావు, అమరేందర్​, ఇరిగేషన్​ ఆఫీసర్లు ఉన్నారు.