కాల్వల నిర్మాణానికి నిధులు తెస్తా : కుంభం అనిల్​కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు : భువనగిరి నియోజకవర్గంలోని బునాదిగాని, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల నిర్మాణానికి నిధులు తెచ్చి పూర్తిచేయిస్తానని ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం వలిగొండ మండలం గొల్నేపల్లి చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించి నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డికి రూ.400 కోట్లకు పైగా ప్రతిపాదనలు పంపామని తెలిపారు. 

గొల్నేపల్లి చెరువును ధర్మారెడ్డిపల్లి కాల్వ ద్వారా నింపాలని ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచించారు. అనంతరం ఎదుళ్లగూడెంలోని వేంకటేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతు పనులను పరిశీలించారు. ఆ తర్వాత ఎత్తి పోతల పథకానికి మోటార్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పార్టీలకతీతంగాగ్రామాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.