- భువనగిరి ఖిల్లాకు రూ.118 కోట్లు
- మొదటి విడతలో రూ. 68 కోట్లు విడుదల
- వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన
యాదాద్రి, వెలుగు : భువనగిరి ఖిల్లా డెవలప్ మెంట్‌పై ఎన్నో ఏండ్ల కల నెరవేరబోతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భువనగిరి ఖిల్లా డెవలప్మెంట్పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్పద్దతిలో శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖిల్లా డెవలప్మెంట్ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్కింద రూ.118 కోట్లు కేటాయించిందన్నారు. మొదటి దశ పనుల కోసం రూ.69 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో రోప్ వే, రోడ్లు, పార్కింగ్ వసతులు, ప్రారంభ ద్వారం, పర్యాటకులకు వసతులు, హరితవనాలు, విశ్రాంతి భవనాలు, సౌండ్ లైటింగ్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. హైదరాబాద్‌కు భువనగిరి దగ్గరగా ఉన్నందున అభివృద్ధి పనులు ఎక్కువ చేయాల్సి ఉంటుందన్నారు.
భువనగిరికి బస్వాపూర్ 6 కిలో మీటర్ల దూరంలోనే ఉందని, అది కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ హెరిటేజ్ విలేజ్‌గా గుర్తించిన భూదాన్‌పోచంపల్లిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీబీనగర్ మండలంలోని మహదేవ్ పూర్ దేవాలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం క్రింద చేపట్టిందని చెప్పారు. కలెక్టర్ హనుమంతు జెండగే మాట్లాడుతూ స్వదేశీ దర్శన్ 2.0 పథకం క్రింద భువనగిరి ఖిల్లా సహా దేశంలోని 53 పనులకు ఈరోజు వర్చువల్ పద్దతిలో ప్రధానమంత్రి ప్రారంభించారని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్డీవో అమరేందర్, జడ్పీటీసీ బీరుమల్లయ్య, అనురాధ, మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, కేంద్ర ప్రభుత్వ టూరిజం అసిస్టెంట్ డైరెక్టరు మౌతోశ్ నాస్కర్, రాష్ట్ర టూరిజం జనరల్ మేనేజర్ ఎం.ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ నేత్ర, డీఆర్డీవో ఎంఏ కృష్ణన్ పాల్గొన్నారు.