ప్రతీ ఊరుకు ఆర్టీసీ బస్సు నడిపించాలి : కుంభం అనిల్​కుమార్​రెడ్డి 

ప్రతీ ఊరుకు ఆర్టీసీ బస్సు నడిపించాలి : కుంభం అనిల్​కుమార్​రెడ్డి 

యాదాద్రి, వెలుగు : భువనగిరి నియోజకవర్గంలోని ప్రతీ ఊరుకు ఆర్టీసీ బస్సు నడిపించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం భువనగిరిలోని తన క్యాంపు ఆఫీసులో నల్గొండ ఆర్ఎం, వివిధ డిపోల మేనేజర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ, భూదాన్​ పోచంపల్లి, బీబీనగర్ మండలాలతోపాటు మోత్కూరు వైపునకు ఆర్టీసీ బస్సులు నడిపించాలన్నారు.

ఆయా మండలాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించి 30 రూట్లను ప్రపోజల్ చేశారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో స్కూల్స్​కు వెళ్లే స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాను ప్రపోజ్ చేసిన రూట్లలో సాధ్యమైనంత త్వరగా బస్సులు నడిపించాలని సూచించారు. సికింద్రాబాద్​, చెంగిచర్ల, హయత్​నగర్, కంటోన్మెంట్, దిల్ సుక్​నగర్​, నల్గొండ, యాదగిరిగుట్ట డిపోల మేనేజర్లు పాల్గొన్నారు. 

ప్రైవేట్​కు ధీటుగా ప్రభుత్వ సూల్స్​.. 

ప్రైవేట్​కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి పట్టణంలోని భగాయత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ హనుమంత్ జెండగే, సినీ నటి, టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఫౌండర్ మంచు లక్ష్మితో కలిసి స్మార్ట్ క్లాస్ రూమ్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచ్ ఫర్ ఛేంజ్, క్లౌడ్ 4సీ స్వచ్ఛంద సంస్థతో కలిసి 33 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్​లు ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండే డిజిటల్ ఎడ్యుకేషన్ విధానం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలనే సంకల్పం గొప్పదన్నారు. మంచు లక్ష్మి, క్లౌడ్ 4సీ స్వచ్ఛంద సంస్థ సీఈవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ బేస్ లైన్, ఎండ్ లైన్, మిడ్ లైన్ పద్ధతిలో డిజిటల్ బోధన కొనసాగుతుందన్నారు.