కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర

కమ్యూనిస్టులది త్యాగాల చరిత్ర
  • సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తాం 
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని 

గజ్వేల్​,  వెలుగు : నిజమైన పోరాటాలు, త్యాగాల చరిత్ర కమ్యూనిస్టులదని.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగినది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. అలాంటి సాయుధ పోరాటాన్ని  హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా బీజేపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల సందర్భంగా  గజ్వేల్ టౌన్ లో శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అధ్యక్షతన వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు నాయకులు  రైతాంగ సాయుధ పోరాటానికి  పిలుపునిచ్చి.. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.  దున్నేవాడికి భూమి ఇవ్వాలనే నినాదంతో 10 లక్షల ఎకరాలు పంచిన ఘనత సీపీఐ పార్టీది అన్నారు.

ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కొన్ని పార్టీలు  చరిత్రను వక్రీకరిస్తున్నాయని విమర్శించారు.  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరులను స్మరించుకుంటూ.. అదే స్ఫూర్తితో  ప్రస్తుత  ప్రభుత్వాల విధానాలపైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేతలు ప్రకాష్ రావు, దయానంద రెడ్డి, శివలింగు కృష్ణ, వనేష్, కిష్టపురం లక్ష్మణ్, అందె, వేల్పుల ప్రసన్నకుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.