బొగ్గు బ్లాకులు సింగరేణికే అప్పగించాలి... వేలం పాట రద్దు చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని

బొగ్గు బ్లాకులు సింగరేణికే అప్పగించాలి... వేలం పాట రద్దు చేయాలి: ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు: బొగ్గు బ్లాకులు వేలం వేయ కుండా నేరుగా సింగరేణి సంస్థకే అప్పగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వేలం పాట రద్దు చేయాలన్నారు. సింగరేణి సంస్థ.. తెలంగాణ గుండె చప్పుడు అని, దాన్ని కార్పొరేట్ అధిపతులకు అప్పగించేందుకు మోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ లక్డీకాపూల్​లోని సింగరేణి భవన్ ముందు వామపక్ష పార్టీల నేతలు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. ‘‘బందిపోటు దొంగల్లాంటి కార్పొరేట్ అధిపతులతో మోదీ కుమ్మక్కై దేశ సంపదను అమ్మేస్తున్నరు. సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తం’’అని అన్నారు. గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనొద్దని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. సింగరేణి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు అన్నారు. కేంద్ర తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తామని మరోసారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిని కాపాడుకునేందుకు మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.