మావోయిస్టుల ఎన్ ​కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే: ఎమ్మెల్యే కూనంనేని

  • ఎదురు కాల్పులపై జ్యుడీషియల్ఎంక్వైరీ వేయాలి: కూనంనేని
  • కాంగ్రెస్ ఏడాది పాలనకు60 మార్కులు
  • బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే..90 శాతం మార్కులు ఇస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మావోయిస్టుల ఎన్ కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల ఘటనలను న్యాయవ్యవస్థ సుమోటోగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ లో మంగళవారం కూనంనేని మీడియాతో మాట్లాడారు. 2026 నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంలోని అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించే వారికి స్వేచ్ఛ లేదా? వారిని బతకనివ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా? తెలియక జరుగుతున్నాయా? లేకపోతే కేంద్ర మంత్రి అమిత్ షా చెబితే చేస్తున్నారా? స్పష్టం చేయాలి” అని డిమాండ్​చేశారు.  

బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మెరుగు

గత బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మెరుగ్గా ఉందని కూనంనేని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్  ప్రభుత్వ పాలనతో పోల్చితే.. కాంగ్రెస్ పాలనకు 90 శాతం మార్కులు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజల ఆలోచన ప్రకారం అయితే 60 శాతం మార్కులేనని చెప్పారు. అయితే, ప్రజాభిమానంతో ప్రభుత్వం డిస్టింక్షన్ సాధించాలన్నారు. రైతు భరోసా, కల్యాణలక్ష్మి బంగారం, మహిళా జ్యోతి, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ల పెంపు తదితర పథకాలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని బీజేపీ, బీఆర్ఎస్​ఆశిస్తున్నాయని.. కానీ, ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు. వామపక్షాల విజ్ఞప్తి మేరకు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి లగచర్ల ఫార్మా సిటీ భూసేకరణను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయడాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా అమలుపై రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నరసింహ పాల్గొన్నారు.